మూవీ రేటింగ్: 4/5
విశ్లేషణ
ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 211కు సంబంధించిన కథే ‘నాంది’ సినిమా. తొలి సినిమాతోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించిన దర్శకుడు విజయ్ కనకమేడలను కచ్చితంగా అభినందించాల్సిందే. ఆయన కథ,కథనాలు సినిమాకు ఊపిరిపోశాయి. క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడి అర్థమయ్యేలా తెరపై చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. పోలీసు ఇన్వెస్టిగేషన్ తీరు, న్యాయవ్యవస్థలోని అంశాలు, న్యాయాన్ని రాజకీయ నాయకులు ఎలా భ్రస్టు పట్టిస్తున్నారనే అంశాలను ఎక్కడా లోపాలు లేకుండా చక్కగా తెరపై చూపించాడు.
‘ఆవేశం సమస్యని సృష్టిస్తుంది.. ఆలోచన దాన్నిపరిష్కరిస్తుంది’, ‘దేవుడు.. మంటలు ఆర్పడానికి నీళ్లు ఇస్తే.. గుండె మంటల్ని ఆర్పడానికి కనీళ్లు ఇచ్చాడు’ లాంటి డైలాగ్స్ గుండెల్ని హత్తుకుంటాయి. ప్రీక్లైమాక్స్‌లోని కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ‘నాంది’ నరేశ్ కెరియర్లో అద్భతమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక శ్రీచరణ్ పాకాల తన రీరికార్డింగ్‌తో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. సిధ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ చోటా కే ప్రసాద్ పనితీరు చాలా బాగుంది. ఎక్కడా సాగతీత లేకుండా సినిమాను చకచకా నడించాడు. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ఓ మంచి సందేశాత్మక చిత్రం లభించిందని చెప్పొచ్చు.
టైటిల్ : నాంది
జానర్ : ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్
నటీనటులు : అల్లరి నరేశ్,వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రవీన్, ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్, వినయ్ వర్మ తదితరులు